
D News: Aug 3: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పోతనకాలనీ 83వ బ్లాక్‌లోని క్వార్టర్ నంబర్ 1151లో ఆదివారం తెల్లవారుజామున వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సింగరేణి కార్మికుడు యాదవనేని వసంత్, ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. వసంత్ సింగరేణిలోని వకీల్‌పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న వసంత్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన అదనపు వంటగ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో అది ఇంటి అంతటా వ్యాపించింది. తలుపులు, కిటికీలు మూసి ఉండటంతో గ్యాస్ సాంద్రత మరింత పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ వాసనను గుర్తించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునేలోపే హాల్లో లైట్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
ప్రమాదంలో విజ్ఞతతో పాటు బాత్రూమ్లో ఉన్న వసంత్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి దంపతులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం సమయంలో బెడ్రూమ్లో ఉన్న వారి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భారీ పేలుడు ప్రభావంతో ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమై కాలిబూడిదైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
