D NEWS: దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి చెందిన దళితులు తమ ఇళ్ల స్థలాలకు ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం దామరగిద్దలో రాస్తారోకో నిర్వహించారు. తరతరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

లోకుర్తి గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2/అ పరిధిలో సుమారు ఐదు ఎకరాల భూమిలో దాదాపు 100 కుటుంబాలు 150 ఏళ్లుగా నివాసం ఉంటున్నట్లు బాధితులు తెలిపారు. తమ పూర్వీకులు గ్రామకంఠం పరిధిలో ఇళ్లు నిర్మించుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కొందరు వ్యక్తులు ఆ భూమిపై హక్కులు ఉన్నాయని చెబుతూ ఇళ్లను జేసీబీలతో కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇళ్ల కోసం రూ.3 లక్షలు చెల్లిస్తారా లేదా నిర్మాణాలను తొలగించాలా అంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారని, నోటీసులు కూడా ఇచ్చారని తెలిపారు.

గత 15 రోజులుగా దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నామని బాధితులు చెప్పారు. అధికారులు సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.

తమ భూమిపై అక్రమంగా రికార్డులు సృష్టించిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరిష్కారం లేకపోతే సీపీఎం, దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.