Little Boy Prajwal Steals the Show Again! Playfully Teases Star Hero Kiran Abbavaram, Producer Allu Aravind and Director Bobby at Summer Holidays Event

సినిమా వేడుకల్లో సాధారణంగా స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ ఇటీవల ఓ చిన్నోడు మాత్రం తన మాటతీరుతో సినీ ప్రముఖులనే నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. అతడే ప్రజ్వల్. గతంలో ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమా కార్యక్రమంలో తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బుడ్డోడు.. తాజాగా ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా వేడుకలోనూ మరోసారి సందడి చేశాడు.

ఈసారి కేవలం మైక్ పట్టుకుని మాట్లాడటమే కాకుండా.. నేరుగా సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించాడు. కార్యక్రమంలో పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బాబీ వద్దకు వెళ్లిన ప్రజ్వల్.. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మామిడిపండ్లు దొంగిలించారా? అంటూ ప్రశ్నించాడు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.

ప్రజ్వల్ ప్రశ్నకు హీరో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. తాను కూడా చిన్నప్పుడు మామిడిపండ్లు దొంగిలించిన సందర్భాలు ఉన్నాయని సరదాగా చెప్పుకొచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ సైతం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. స్కూల్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఓ ఇంట్లో మామిడి చెట్టు కనిపించడంతో లోపలికి వెళ్లి పండ్లు కోసుకుని పరుగెత్తినట్లు వెల్లడించారు.

ఇక దర్శకుడు బాబీ సమాధానం అందరినీ మరింత నవ్వించింది. దొంగతనం చేయనివాడు ఇండస్ట్రీకి రాడని, సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరూ దొంగలేనని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం ప్రజ్వల్‌ను కూడా చిన్ననాటి చిలిపి పనుల గురించి ప్రశ్నించారు. షూటింగ్ సమయంలో సహనటికి లైన్ వేశావా? అని అడగ్గా.. తాను అందరినీ అక్క అని పిలుస్తానంటూ అమాయకంగా సమాధానమిచ్చాడు. దీంతో అక్కడున్న సినీ ప్రముఖులు, ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు.

సమయస్ఫూర్తితో ఆకట్టుకుంటున్న ప్రజ్వల్

ప్రజ్వల్ ప్రత్యేకత కేవలం చురుగ్గా మాట్లాడటమే కాదు.. ఎదుటివారు అడిగే ప్రశ్నలకు ఏమాత్రం తడబడకుండా సమయస్ఫూర్తితో సమాధానాలు ఇవ్వడం. అల్లు అరవింద్, బాబీ వంటి సీనియర్ సినీ ప్రముఖులతోనూ ఎలాంటి బెరుకు లేకుండా సరదాగా సంభాషించడం అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమా కార్యక్రమంలో ప్రజ్వల్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న సినీ ప్రముఖులు ఈ వేడుకలోనూ అతడితో సరదాగా మాట్లాడారు. మరోసారి తన ప్రసంగం వినిపించాలంటూ అడిగిన సందర్భాలు కూడా కనిపించాయి.

మొత్తానికి గత ఈవెంట్‌లో తన ప్రసంగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రజ్వల్.. ఈసారి తన చిలిపి ప్రశ్నలతో హీరోలు, నిర్మాతలు, దర్శకులను నవ్వించాడు. చిన్న వయసులోనే తన మాటతీరు, చురుకుదనం, సమయస్ఫూర్తితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ చిన్నోడి వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *