
D Educt: Sept 3: ఉన్నత విద్యలో FRS హాజరు.. బీఈడీ, లా కళాశాలల్లో తీవ్ర జాప్యం
ఉన్నత విద్యలో విద్యార్థులకు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు (FRS) నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో FRS విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని నీరుగార్చేందుకు కొన్ని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఈడీ, న్యాయవిద్య (లా) కళాశాలలు విద్యార్థుల హాజరు నమోదుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
బీఈడీ కళాశాలల్లో దాదాపు 70 శాతం మంది విద్యార్థులు ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందినవారే ఉంటున్నట్లు సమాచారం. న్యాయవిద్యలోనూ దాదాపు సగం మంది ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. వీరిలో చాలామంది క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్న దాఖలాలు లేవని తెలుస్తోంది. ప్రవేశాలు, తరగతుల నిర్వహణ వంటివి రికార్డులకే పరిమితమవుతున్నాయని, పరీక్షల సమయంలో మాత్రమే విద్యార్థులు కళాశాలలకు వచ్చి పరీక్షలు రాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు FRS హాజరు నమోదు చేసేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా FRS విధానాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామంటూ కొన్ని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కళాశాల నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రెండు నెలలు గడిచినా పూర్తి కాని నమోదు
కళాశాలలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో పూర్తిస్థాయిలో నమోదు చేయలేదు. రాష్ట్రంలోని 21 విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 10,38,396 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పటివరకు 5,16,533 మంది వివరాలను మాత్రమే ఆయా కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్లో నమోదు చేశాయి.
విభాగాల వారీగా చూస్తే బీఈడీ కళాశాలల్లో కేవలం 7 శాతం మంది విద్యార్థుల వివరాలే నమోదయ్యాయి. న్యాయవిద్యలో 23 శాతం, EAPCET-BPC స్ట్రీమ్‌లో 47.9 శాతం, MPC స్ట్రీమ్ ఇంజినీరింగ్, ఫార్మసీలో 64.3 శాతం, డిగ్రీలో 45.3 శాతం, పీజీలో 29.7 శాతం, వ్యాయామ విద్యలో కేవలం 0.5 శాతం మంది వివరాలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు.
విద్యార్థుల ఆన్లైన్ హాజరు నమోదుపై ఉన్నత విద్య కమిషనరేట్ అధికారులు ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. కొన్ని కళాశాలల యాజమాన్యాలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బీఈడీ కళాశాలల హాజరు నమోదుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో ఇతర కళాశాలల యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం.
అధ్యాపకుల హాజరులోనూ ఇదే పరిస్థితి
విద్యార్థులే కాకుండా అధ్యాపకుల FRS నమోదులోనూ పూర్తిస్థాయి పురోగతి కనిపించడం లేదు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో కలిపి 87,330 మంది అధ్యాపకులు ఉండగా.. ఇప్పటివరకు 68,709 మంది మాత్రమే తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.
బీఈడీ కళాశాలల్లో 6,552 మంది అధ్యాపకులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 3,212 మంది మాత్రమే FRS కోసం తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే వివరాలు నమోదు చేసినప్పటికీ ఆన్లైన్ హాజరు మాత్రం సక్రమంగా వేయడం లేదని తెలుస్తోంది.
న్యాయవిద్య కళాశాలల్లో 933 మంది అధ్యాపకులు ఉండగా.. వీరిలో 823 మంది తమ వివరాలను నమోదు చేసుకు
