D News: కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు బయల్దేరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు వెయ్యి డప్పులతో ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు.

ఎర్రవల్లి వైపు కాంగ్రెస్ నేతల పయనం

స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. కేసీఆర్ నివాసం వద్ద వెయ్యి డప్పులతో నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు బయల్దేరడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

దామరకుంట వద్ద ఉద్రిక్తత

మర్కుక్ మండలం దామరకుంట వద్ద ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో వాహనాలపై రాళ్ల దాడి జరిగిందని, ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం.

ఫామ్‌హౌస్‌కు కేటీఆర్, హరీశ్‌రావు

ఉద్రిక్త పరిస్థితులపై సమాచారం అందుకున్న కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీ సమావేశాల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు బయల్దేరారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు తాజా ఉద్రిక్తతలపై కేసీఆర్‌తో వారు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎర్రవల్లి పరిసరాల్లో భారీ బందోబస్తు

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఎర్రవల్లి, వెంకటాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫామ్‌హౌస్ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు