ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మరో 23 మంది చిన్నారులు గాయపడిన నేపథ్యంలో వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు. అభంశుభం తెలియని చిన్నారులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రిమ్స్‌లో నెలకొన్న దుస్థితిపై జిల్లా స్థాయి బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పిల్లల వార్డులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉండాల్సినప్పటికీ ప్రభుత్వ పర్యవేక్షణ లోపించిందని కేటీఆర్ అన్నారు. కనీస నిర్వహణ లేకపోవడమే ఈ దురదృష్టకర ఘటనకు కారణమైందని ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల వార్డులు ఐసీయూలను వెంటనే నిపుణుల బృందాలతో తనిఖీ చేయించాలని కేటీఆర్ కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదంలో పిల్లలను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరారు.