D Spiritual: Oct 29: గజ్వేల్: వర్గల్‌లోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో బుధవారం కృత్తికా నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఆలయంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

కృత్తికా నక్షత్ర వేడుకలకు తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదాన్ని అందజేశారు. స్వామివారి అనుగ్రహం పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.