D Spiritual: Nov 20: యాదాద్రిలో వైభవంగా సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన.. పుష్పాలతో స్వామివారికి విశేష పూజలు!

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న కార్తీక వైభవోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముందుగా దేవస్థాన అర్చకులు, వేద పండితులు అంతరాలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు.

అనంతరం కోటి పుష్పార్చన కోసం భక్తిశ్రద్ధలతో సేకరించిన వివిధ రకాల పుష్పాలను ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీ స్వామివారిని విశేషంగా అలంకరించి మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శోభాయమానంగా ఊరేగింపు సేవ నిర్వహించారు. ఈ ఊరేగింపు ఆలయ మాడవీధుల మీదుగా కొనసాగి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోటి పుష్పార్చన మండప ప్రాంగణానికి చేరుకుంది.

అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో సహస్రనామావళి పారాయణంతో కోటి పుష్పార్చన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. పుష్పాల సౌరభం, వేదమంత్రాల నడుమ యాదాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

ఈ పవిత్ర కార్యక్రమంలో వేద పండితులు, వేద విద్యార్థులు, దేవస్థానం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి సమర్పించేందుకు భక్తులు స్వయంగా తీసుకువచ్చిన పుష్పాలను భక్తిశ్రద్ధలతో అందజేసి కోటి పుష్పార్చనలో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె. భవానీ శంకర్, డీఈవో దొర్బాల భాస్కర్ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *