
D Educt: Aug 24: విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష క్విజ్‌లో కోదాడ విద్యార్థి ప్రతిభ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సంయుక్తంగా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ఈ నెల 17న ఆన్లైన్లో ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష క్విజ్’ పోటీలను నిర్వహించాయి.
ఈ పోటీల్లో సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి కత్తి అక్షయ్‌రెడ్డి ప్రతిభ కనబరిచి అంతరిక్ష సదస్సుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, డైరెక్టర్ సోమిరెడ్డి శనివారం వెల్లడించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన 30 మంది విద్యార్థులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరిని జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో నిర్వహించే అంతరిక్ష సదస్సుకు ఆహ్వానించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
కోదాడకు చెందిన అక్షయ్‌రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
