
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వచ్చే సీజన్లో కొత్త సారథి ఎవరనే చర్చ మొదలైంది. అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో KKR తదుపరి కెప్టెన్‌పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న భారత యువ బ్యాటర్ రింకు సింగ్ పేరు కెప్టెన్సీ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
రింకు సింగ్‌కు ఇటీవల లభించిన కెప్టెన్సీ అనుభవం కూడా ఈ చర్చకు బలం చేకూరుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జట్టుకు సారథ్యం వహించిన రింకు.. తన నాయకత్వంలో జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు.
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో మీరట్ మావెరిక్స్.. లక్నో ఫాల్కన్స్‌పై ఏకంగా 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టుకు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, రింకు సారథ్యంలోని మావెరిక్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫైనల్లో బ్యాటర్‌గా రింకు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, కెప్టెన్‌గా మాత్రం జట్టును విజయవంతంగా నడిపించాడు.
ఈ టోర్నీలో మీరట్ మావెరిక్స్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. తొమ్మిది విజయాలతో అద్భుతమైన రికార్డు నమోదు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో రింకు సింగ్ నాయకత్వ లక్షణాలపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.
మరోవైపు రింకుకు KKRతో ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. గత ఐపీఎల్ సీజన్లో అతడు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రింకు ఇప్పటివరకు 73 మ్యాచ్‌లు ఆడాడు. కోల్‌కతా తరఫున కీలక సందర్భాల్లో పరుగులు సాధిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ వేసిన ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన ఇన్నింగ్స్‌తో రింకు సింగ్ ఒక్కసారిగా స్టార్‌గా మారాడు. ఇప్పుడు అతడి కెప్టెన్సీ అనుభవం, KKRతో ఉన్న అనుబంధం, జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న స్థానం దృష్ట్యా వచ్చే సీజన్లో కోల్‌కతా పగ్గాలు రింకుకు అప్పగిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.
