అమెరికాలో హెచ్-1బీ వీసా కార్యక్రమంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో జరుగుతున్న మోసాలు, నిబంధనల ఉల్లంఘనలపై అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పొసిటో దర్యాప్తు ప్రారంభించారు. బ్రైట్‌బార్ట్ నివేదిక ప్రకారం.. హెచ్-1బీ వ్యవస్థలో కొన్ని కంపెనీలు, మధ్యవర్తులు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హెచ్-1బీ కార్యక్రమం మొదట అమెరికాలో అందుబాటులో లేని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకునేందుకు రూపొందించారు. అయితే ప్రస్తుతం కొన్ని సంస్థలు ఈ వీసా విధానాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయని డి’ఎస్పొసిటో అన్నారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల్లో పెద్ద సంఖ్యను హెచ్-1బీ వీసాదారులతో భర్తీ చేస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే ఈ వ్యవహారంలో హెచ్-1బీ ఉద్యోగులనే నిందించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను సరిగా అమలు చేయని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం, విదేశీ ఉద్యోగులను తక్కువ వేతనాలకు నియమిస్తున్న కంపెనీలే ప్రధాన బాధ్యులని అన్నారు. హెచ్-1బీ ఉద్యోగులను కొన్ని సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికన్ ఉద్యోగులతో పోలిస్తే హెచ్-1బీ ఉద్యోగులకు 25–30 శాతం వరకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయని డి’ఎస్పొసిటో తెలిపారు. ఉద్యోగం, వీసా కోల్పోయే పరిస్థితుల్లో కొందరు విదేశీ కార్మికులు మరింత తక్కువ వేతనాలతో పనిచేయాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు.

మోసాలపై ప్రత్యేక దర్యాప్తు

ఈ దర్యాప్తు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆధ్వర్యంలోని మోసాల నిర్మూలన టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా జరుగుతోంది. జూలైలో ప్రారంభమైన ఈ టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో అక్రమ ఆయుధాలు, ఇతర నేరాలకు సంబంధించిన అంశాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. హెచ్-1బీ వ్యవస్థపై గతంలో పర్యవేక్షణ తక్కువగా ఉండటం వల్ల కొన్ని కంపెనీలు విదేశీ కార్మికులపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని డి’ఎస్పొసిటో ఆరోపించారు. కొత్త దర్యాప్తు వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం కాదని, ఉద్యోగ మార్కెట్‌లో న్యాయం, పారదర్శకతను కాపాడటమే లక్ష్యమని ఆయన చెప్పారు.

60 రోజుల గడువు తొలగించే ప్రతిపాదన

ఇదిలా ఉండగా, ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఉద్యోగం కోల్పోయిన కొందరు హెచ్-1బీ ఉద్యోగులు అమెరికాలో ఉండేందుకు కొత్త మార్గాలను త్వరగా కనుగొనాల్సి రావచ్చు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలిస్తోంది. సమీక్ష పూర్తయిన తర్వాత ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించి 30 నుంచి 60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉంది. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.

నిబంధన అమల్లోకి వస్తే, వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు అమెరికాలోనే మరో కంపెనీకి మారడం లేదా వేరే వీసా కేటగిరీకి మారడం కష్టమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో యూఎస్‌సీఐఎస్ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగం, వీసా పరిస్థితిపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది.