
D Educt: Oct 2: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ పరీక్షా విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త సిలబస్‌తో పాటు అన్ని సబ్జెక్టుల్లో అంతర్గత మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టింది. దీంతో విద్యార్థులు ఇకపై థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్, వివిధ విద్యా కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్త విధానంలో రాత పరీక్షకు 80 శాతం, ప్రాక్టికల్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు 20 శాతం మార్కులు కేటాయించారు. 80 మార్కులకు నిర్వహించే థియరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు కనీసం 28 మార్కులు సాధించాలి. అలాగే 20 మార్కులకు నిర్వహించే ప్రాక్టికల్ లేదా అంతర్గత మూల్యాంకనంలో కనీసం 7 మార్కులు పొందాల్సి ఉంటుంది.
మరోవైపు, గణిత శాస్త్రంలోనూ మార్కుల విధానంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు 75 మార్కులకు నిర్వహించే తుది పరీక్షను ఇకపై 60 మార్కులకు నిర్వహించనున్నారు. మిగిలిన 15 మార్కులను అంతర్గత మూల్యాంకనానికి కేటాయించారు.
హ్యుమానిటీస్ విభాగంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు కేటాయించారు. అలాగే భాషా సబ్జెక్టుల పబ్లిక్ పరీక్షలను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా 80 మార్కులకు నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా కేటాయిస్తారు.
ఇంటర్ సెకండియర్‌లో ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంతో పాటు ప్రాక్టికల్ మాన్యువల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త పరీక్షా విధానానికి సంబంధించిన వివరాలతో పాటు సబ్జెక్టుల వారీగా థియరీ, ప్రాక్టికల్స్ మార్కుల వివరాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
కొత్త పరీక్షా విధానంపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు థియరీతో పాటు అంతర్గత మూల్యాంకనం, ప్రాక్టికల్స్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు సూచనలు చేసింది.
