
D News: Oct 2: రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్‌ఫెడ్)ను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సంస్థలో ఖాళీగా ఉన్న 103 పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఖాళీలను వెంటనే భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు నూనెగింజల ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అయితే ఆయిల్‌ఫెడ్‌లో సిబ్బంది కొరత కారణంగా ఈ కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు ఆయిల్‌ఫెడ్ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 103 పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు సమర్పించింది.
ఈ 103 పోస్టులను భర్తీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.11.52 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సిబ్బంది నియామకాలతో ఆయిల్‌ఫెడ్ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే సమయంలో మరో 141 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన నియమించాలని ఆయిల్‌ఫెడ్ ప్రతిపాదించింది. అయితే పొరుగు సేవల విధానానికి బదులుగా శాశ్వత ప్రాతిపదికన 103 పోస్టుల భర్తీకే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో ఆయిల్‌ఫెడ్‌లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
