
D News: Oct 2: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు.
డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందించే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న రిక్రూట్మెంట్ విధానాన్ని దేశవ్యాప్తంగా పరిశీలిస్తున్నారని, రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఫలితాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను ముందస్తుగా చేపట్టాలని సూచించారు.
మరోవైపు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దీనిపై ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పందిస్తూ.. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుందని వివరించారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల క్యాంపస్ల ఏర్పాటుకు పలు యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. జేఎస్ఎస్ యూనివర్సిటీ, థాపర్ యూనివర్సిటీ, యూపీఈఎస్, జేయూఎస్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, సవిత యూనివర్సిటీ తదితర సంస్థలు ఏపీలో క్యాంపస్ల ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల క్యాంపస్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. క్యాంపస్ల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
