
DNews: Nov 28: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పలు కార్యక్రమాలలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఈ ప్రాజెక్టు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిజాంసాగర్ ప్రాజెక్టు డ్రెడ్జింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్ పర్యాటకాన్ని అభివృద్ధి చేసి, కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. మోంతా తుఫాను కారణంగా జిల్లాలోని పత్తి రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారని, జుక్కల్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం జాగృతి పోరాడుతోందని తెలిపారు. అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వాలని, అనుమతి పేరుతో డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో కనిపించకపోవడాన్ని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి పార్టీలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. జుక్కల్ ఎమ్మెల్యే రహదారుల కోసం ఆందోళన చేసిన యువతపై కేసులు పెట్టడం తప్పు అని, ఆ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 317 జి.ఓ. కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని వారి స్వస్థలాలకు పంపాలని సూచించారు. గొర్రెల కోసం డీడీలు సైన్ చేసి అప్పుల్లో కూరుకుపోయిన వారిని గుర్తించి, అర్హులకు వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
