
DNews: Nov 17: ఖమ్మం జిల్లా: జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, ప్రస్తుతం ఆధారిత ఉద్యోగాలను కాపాడలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీ సింగరేణి కార్మికులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, గత రెండు సంవత్సరాలుగా మెడికల్ బోర్డుకు కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నానని తెలిపారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి బీమా లాంటిదని, ఆధారిత ఉద్యోగాల కోసం తాను పోరాడతానని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల కోసం ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, తమ కోసం పోరాడుతున్న తమకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేయడాన్ని అంగీకరించలేమని స్పష్టం చేశారు. సింగరేణిపై ప్రభుత్వం రూ. 40,000 కోట్ల మేర బాకీ పడిందని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ నిర్మాణానికి ముందు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వతంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. బొగ్గు గనిలోకి వెళ్లే ముందు మైసమ్మకు ప్రార్థనలు చేసి జాగ్రత్తగా ఉండాలని కవిత సూచించారు.
