D Entr: Jul 14: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తాజాగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దినేశ్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటించిన ఈ చిత్రం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చిన్న సినిమా నిర్మాతలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించే అవకాశం వస్తే సినీ పరిశ్రమ అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న నిర్మాతల ప్రయోజనాల కోసం కొత్త సినీ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌ను కవిత ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఆయనపై తనకు కాస్త అలక ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. “చరణ్ అర్జున్ స్వరపరిచిన ‘మూడు రంగుల జెండా’ పాట ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేంతగా ప్రజాదరణ పొందింది. అంతటి ప్రభావం చూపిన పాట ఇచ్చినందుకే ఆయనపై నాకు కొంచెం అలక ఉంది” అని నవ్వుతూ అన్నారు. ఇదే తరహాలో ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు.

సినిమా టైటిల్‌లోని ‘తాలూకా’ అనే పదంపైనా కవిత స్పందించారు. తెలంగాణలో ఈ పదం పెద్దగా వినిపించదని పేర్కొంటూ, రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని అన్నారు. రెండు రాష్ట్రాల సంస్కృతులను పరస్పరం గౌరవించుకున్నప్పుడే తెలుగు భాష, సంస్కృతి మరింత బలపడతాయని, తెలుగు సినిమా రెండు ప్రాంతాల ప్రజలను కలిపే వారధిగా కొనసాగాలని ఆకాంక్షించారు.

చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లుగా చిన్న నిర్మాతలు, థియేటర్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మన రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు. ఓటీటీ వేదికలు కూడా పూర్తిగా వ్యాపార ధోరణిలోనే వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఆస్తులు అమ్మి సినిమాలు నిర్మించే చిన్న నిర్మాతలు నిలదొక్కుకుంటేనే చిత్ర పరిశ్రమ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో తమకు అధికార బాధ్యతలు వస్తే చిన్న చిత్రాల అభివృద్ధికి అనుకూలంగా బలమైన సినీ విధానాన్ని రూపొందిస్తామని కవిత స్పష్టం చేశారు. నిర్మాతలకు అవసరమైన ప్రోత్సాహకాలు, రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ చిత్రంలో దినేశ్ కుమార్ హీరోగా నటించగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సతీశ్ ఆవాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.