D Spiritual: Nov 23: నవంబర్ 24న తిరుమలలో ఘనంగా కార్తీక పర్వదీపోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు సంబంధించి దేవస్థానం అధికారులు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన అనంతరం దీపోత్సవం ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో నేతి వత్తులతో దీపాలను వెలిగించనున్నారు. ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ దీపాలను ఊరేగింపుగా తీసుకెళ్లి విమాన ప్రదక్షిణం నిర్వహిస్తారు. అనంతరం ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి సమర్పించనున్నారు.

ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో దీపాలంకరణ

దీపోత్సవంలో భాగంగా ఆలయంలోని గర్భాలయం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభా అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి తదితర ప్రాంతాల్లో దీపాలను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవరాహస్వామి ఆలయంతో పాటు స్వామి పుష్కరిణి వద్ద కూడా దీపాలను వెలిగించనున్నారు.

పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు

కార్తీక పర్వదీపోత్సవం నేపథ్యంలో నవంబర్ 24న నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆరోజు జరిగే సహస్ర దీపాలంకరణ సేవను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *