
ESI New Rules 2026: ఈఎస్ఐ కార్డు కలిగిన ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఈఎస్ఐ ప్రయోజనాలకు సంబంధించిన నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఇందుకోసం ఈఎస్ఐ కార్డుకు ఆధార్, బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది. నవంబర్ 20 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు సమాచారం.
ESI New Rules 2026: ఉద్యోగులు, కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఉద్యోగుల రాష్ట్ర బీమా (ESI) పథకంలో భాగంగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులతో ఈఎస్ఐ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు ప్రయోజనాలను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి చేరేలా చర్యలు చేపట్టింది.
ఈ మేరకు పాత రాష్ట్ర బీమా నిబంధనలు-1950 స్థానంలో కార్మిక రాజ్య బీమా నిబంధనలు-2026ను అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొంటున్నారు. నవంబర్ 20 నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఈ మార్పుల గురించి తెలుసుకోవడం అవసరం.
ఇకపై ఈఎస్ఐ సేవలన్నీ ఆన్లైన్లోనే!
కొత్త నిబంధనల ప్రకారం ఈఎస్ఐ సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలో అందించనున్నారు. ఉద్యోగుల నమోదు, గుర్తింపు కార్డుల జారీ, క్లెయిమ్‌ల ప్రక్రియలను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. దీంతో ఉద్యోగులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది.
ముఖ్యంగా ప్రసూతి, అనారోగ్య ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్‌ల ప్రక్రియను సులభతరం చేయనున్నారు. యజమాని సమర్పించే వివరాలు, అవసరమైన వైద్య ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అర్హులైన ఉద్యోగులకు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.
ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరి
ఈఎస్ఐ ప్రయోజనాలు పొందాలనుకునే ఉద్యోగులు తమ ఈఎస్ఐ నంబర్‌కు ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా నగదు బదిలీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు నేరుగా అందనున్నాయి.
కొత్తగా ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు కొన్ని ప్రయోజనాలు పొందేందుకు తొమ్మిది నెలల చందా కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల నమోదు బాధ్యతను కూడా యాజమాన్యాలకే అప్పగించారు. కంపెనీలు తమ ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగుల నమోదు బాధ్యత కంపెనీలదే
కొత్త విధానంలో ఉద్యోగి ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను యాజమాన్యాలు ఆన్లైన్లో సమర్పించాలి. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ ఈఎస్ఐ కార్డును రూపొందిస్తారు.
అంతేకాకుండా ప్రతి నెల చందా ప్రక్రియకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. నెల ముగిసిన 15 రోజుల్లోగా యాజమాన్యాలు ఉద్యోగుల తరఫున చందాలను జమ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయకపోతే బకాయిలపై నెలకు ఒక శాతం జరిమానా విధించే నిబంధన ఉంది.
ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి మూడు నెలల్లో ప్రయోజనాలు
ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఉద్యోగి మరణించిన సందర్భంలో అతడి కుటుంబ సభ్యులకు అందాల్సిన ప్రయోజనాల చెల్లింపులోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఉద్యోగి మరణించిన తర్వాత మూడు నెలల్లోగా అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రయోజనాలు అందించాల్సి ఉంటుంది.
అలాగే వైద్య ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన సందర్భాల్లో వైద్యుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి చేశారు.
34 తీవ్రమైన వ్యాధులకు వైద్య ప్రయోజనాలు
ఈఎస్ఐ పథకం కింద తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు వైద్య సేవలు అందించే అంశంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, పక్షవాతం వంటి 34 తీవ్రమైన వ్యాధులను ఈ పరిధిలో చేర్చినట్లు సమాచారం.
మొత్తంగా కొత్త నిబంధనలతో ఈఎస్ఐ సేవల్లో డిజిటల్ విధానం బలోపేతం కానుంది. ఉద్యోగులకు నగదు ప్రయోజనాలు నేరుగా అందడంతో పాటు వైద్య సేవలు, క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సులభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈఎస్ఐ కార్డు ఉన్న ఉద్యోగులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
