
D Spiritual: Nov 10: శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు.. ఆర్జిత సేవల్లో కీలక మార్పులు!
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఆర్జిత సేవల్లో పలు కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా రూ.5 వేల విలువైన గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ సేవలకు బదులుగా భక్తులకు స్వామివారి అలంకార దర్శనం కల్పించనున్నారు.
అలాగే భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి శని, ఆదివారాలు, సోమవారాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిలిపివేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం నిర్దిష్ట సమయాల్లో విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులు దేవస్థానం ప్రకటించిన దర్శన సమయాలు, ఆర్జిత సేవల మార్పులను గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం చర్యలు చేపట్టింది.
