
D Spiritual: Nov 17: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక మాస సందడి నెలకొంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలివెళ్తున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు కార్తికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
కార్తికోత్సవాల్లో భాగంగా ఈ నెల 20న సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు మాడుగుల నాగఫణిశర్మ ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వనున్నారు. 21న సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఆధ్వర్యంలో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 22న ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రుద్రాక్ష ఫౌండేషన్ బృందం ఆధ్వర్యంలో ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అభినేత్రి బృందం తెలంగాణ ఆలయాల ఇతివృత్తంతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనుంది.
అదేవిధంగా ఈ నెల 20న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థాన అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి నామార్చన సహిత కోటి పుష్పార్చన నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్తికోత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
