
DET:FEB 14:
కోర్టు కేసు ఉపసంహరణ – మద్రాస్ హైకోర్టు తీర్పు:
విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నటిస్తున్న చివరి సినిమా కావడంతో జన నాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో గత కొన్ని రోజులుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మరియు చిత్ర యూనిట్ మధ్య వివాదం నడుస్తోంది.దీనిపై చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.తాజాగా ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకోవడంతో జస్టిస్ పి.టి. ఆశా ఈ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.దీంతో ఈ సినిమాపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి.
తిరిగి సెన్సార్ పరిశీలనకు జన నాయగన్:
సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని అలాగే సైనిక అంశాలకు సంబంధించి రక్షణ నిపుణుల సలహాలు తీసుకోలేదని ఫిర్యాదులు రావడంతో బోర్డు సర్టిఫికెట్ ఆపేసింది.ఇప్పుడు నిర్మాతలు కోర్టు కేసును పక్కన పెట్టి సెన్సార్ బోర్డు సూచించిన రివైజింగ్ కమిటీ ద్వారా సినిమాను మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.అధికారికంగా ఈ చిత్రం ఇప్పుడు పునర్విచారణకు వెళ్తోంది.
రివైజింగ్ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు:
కొత్తగా ఏర్పడే రివైజింగ్ కమిటీ మరో 20 రోజుల్లోపు సినిమాను చూసి తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది.వారు సూచించే మార్పులు చేర్పుల తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తుంది.అంతా సవ్యంగా జరిగితే మార్చి మొదటి వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
సినిమా విశేషాలు మరియు అంచనాలు:
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పొలిటికల్ సోషల్ డ్రామా.ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా బాబీ డియోల్,మమితా బైజు,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
