
DNews: Dec 06: హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొదటి నుంచే గాంధీ, నెహ్రూ పై దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారని, గాంధీపై దుష్ప్రచారం చేయగా ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా మారడంతో ఇప్పుడు నెహ్రూ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇందిరా గాంధీ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించారని, చరిత్రను చెరిపివేయడానికి బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి, “గాంధీ కుటుంబం ఎప్పుడూ కుట్ర రాజకీయాలు చేయలేదు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీ కుటుంబం శాంతియుతంగా పోరాడింది. గాంధీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారు, ఈ చరిత్రను ఎవరూ మార్చలేరు. అప్పట్లో బీజేపీ లేదు, అందుకే గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడింది నెహ్రూ ప్రధాని కావడానికి కాదు, ప్రజలే నెహ్రూను ప్రధాని కావాలని కోరుకున్నారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు. నెహ్రూ లౌకికవాదాన్ని విశ్వసించారని, ఆయన త్యాగాలను మరిపించడానికి బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ కుటుంబంపై కూడా చెడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత నెహ్రూ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రజలు ఏకగ్రీవంగా ఆయనను ప్రధాని కావాలని నిర్ణయించారని చెప్పారు. “ఇప్పుడు ఓటింగ్ యంత్రాలు రెండు సార్లు స్వయంగా ఓటు వేసాయి, అందుకే బీజేపీ అధికారంలోకి వస్తోంది. స్వాతంత్ర్యం రోజుల్లో నెహ్రూ పాలనలో ఆకలితో మరణాలు జరగలేదు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మించారు” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
