శ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గుర్తుతెలియని వైమానిక వస్తువు నౌకను ఢీకొట్టడంతో గుజరాత్‌కు చెందిన భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది.

ఎంఎస్‌వీ అల్ జుసుఫీ నౌకపై దాడి
భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్‌వీ అల్ జుసుఫీ (MSV Al Jusufi) అనే నౌకపై సోమవారం ఒమన్ తీరానికి సమీపంలో గుర్తుతెలియని వైమానిక వస్తువు దాడి చేసినట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
ఈ నౌకలో మొత్తం 14 మంది భారతీయ నావికులు ఉన్నారు. దాడి అనంతరం 13 మంది సురక్షితంగా బయటపడి ఒమన్ కోస్ట్ గార్డ్ సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు.
గుజరాత్‌కు చెందిన నావికుడు మృతి
ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన గంధర్ నహీమ్ అజీజ్ (Gandhar Nahim Ajij) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆయన మృతిపై మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు, ప్రాణాలతో బయటపడిన 13 మంది సిబ్బందికి సహకరించేందుకు భారత ప్రభుత్వం, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
వాణిజ్య నౌకలపై దాడులతో ఆందోళన
హోర్ముజ్ జలసంధి, ఒమన్ పరిసర సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు నావికుల భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించాలని భారత్ ఇప్పటికే కోరుతోంది.
తాజా దాడికి కారణమైన వస్తువు ఏమిటి, దాడి వెనుక ఎవరు ఉన్నారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
