
D Educt: Nov 7: తెలంగాణలో భారీగా పెరిగిన పీజీ వైద్య సీట్లు.. కొత్తగా 769 సీట్లు అందుబాటులోకి!
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి వైద్య విద్య పీజీ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి కొత్తగా 769 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 6న జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పరిధిలోని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) దేశవ్యాప్తంగా పెంచిన సీట్ల వివరాలను వెల్లడించింది.
ప్రభుత్వ కళాశాలల్లో 300 సీట్లు పెంపు
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈసారి 300 పీజీ సీట్లు పెరిగాయి. మొత్తం 400 సీట్లు పెంచాలని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) విభాగం ప్రతిపాదనలు పంపగా, ఎన్ఎంసీ 300 సీట్లకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 1,766కు చేరనుంది.
ప్రైవేటు కాలేజీల్లో 469 సీట్లు అదనం
ప్రైవేటు వైద్య కళాశాలల్లో మరో 469 పీజీ సీట్లు పెరిగాయి. దీంతో ఆ కళాశాలల్లో మొత్తం సీట్ల సంఖ్య 2,419కి చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 4,185 పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
మెరిట్ జాబితా విడుదలకు కసరత్తు
ఇప్పటికే పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలో అర్హుల మెరిట్ జాబితాను ప్రకటించనుంది. భూపాలపల్లి, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కళాశాలల వారీగా కోర్సులు, సీట్ల వివరాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య రమేశ్‌రెడ్డి తెలిపారు.
మిగిలిన యూజీ సీట్ల భర్తీకి ప్రత్యేక అవకాశం
మరోవైపు రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో సుమారు 175 యూజీ సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిని స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్ ద్వారా నవంబర్ 16వ తేదీలోపు భర్తీ చేయాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
