
D Spiritual: Nov 24: తలమడుగు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన నెలరోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు
తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. కోజాగిరి పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు 30 రోజుల పాటు ఆలయంలో భక్తులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటలకే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకునేవారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భజనలు, భక్తి కీర్తనలతో వెంకటేశ్వర స్వామిని స్మరించుకునేవారు. నెల రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం నిత్యం హరినామస్మరణతో మార్మోగింది.
ఆలయం నిర్మించిన నాటి నుంచి గ్రామస్తులు ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారని ఆలయ అర్చకులు కళ్యాణ్ తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం గ్రామంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామస్తుల మధ్య ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
కార్తీక మాసం ముగిసినా స్వామివారి నామస్మరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కలిగిన భక్తిభావం తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
