తెలుగు ఓటీటీ రంగంలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న పొలిటికల్ డ్రామా ‘మయసభ’ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డు కోసం నామినేషన్ దక్కించుకుంది. ఈ విభాగంలో నామినేషన్ పొందిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 2023లో ఈ అవార్డు విభాగం ప్రారంభమైన తర్వాత ఓ తెలుగు సిరీస్‌కు ఈ గుర్తింపు రావడం విశేషం.

ఏపీ రాజకీయ నేపథ్యంతో ఆసక్తికర కథనం

ప్రముఖ దర్శకుడు దేవా కట్టా పర్యవేక్షణలో రూపొందిన ఈ సిరీస్‌కు దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. హిట్‌మెన్, ఫ్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లపై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష సంయుక్తంగా నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, నాయకుల మధ్య స్నేహాలు, విభేదాలు, రాజకీయ ప్రత్యర్థిత్వాలు, అధికార సమీకరణాల్లో వచ్చిన మార్పులను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా ఆవిష్కరించారు. రాజకీయాల వెనుక ఉండే వ్యక్తిగత సంబంధాలు, వ్యూహాలను కథలో భాగంగా చూపించారు.

ప్రముఖ నటీనటుల అభినయం

ఈ వెబ్ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథకు తగ్గ నటన, విభిన్నమైన కథనం, నాణ్యమైన నిర్మాణ విలువలు ‘మయసభ’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా ఈ సిరీస్‌కు మంచి స్పందన లభించింది.

తెలుగు ఓటీటీ రంగానికి మరో గుర్తింపు

ఇప్పటికే తన కథాంశంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘మయసభ’.. తాజాగా ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుల నామినేషన్‌తో మరో మెట్టు ఎక్కింది. జాతీయ స్థాయిలో తెలుగు వెబ్ కంటెంట్‌కు గుర్తింపు లభించడం డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ నామినేషన్‌తో అవార్డును సొంతం చేసుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *