DET:NOV 14:
అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్: అంచనాలు:
పుష్ప 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,జవాన్ లాంటి సెన్సేషనల్ హిట్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.సన్ పిక్చర్స్ సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పాన్-వరల్డ్ మూవీని నిర్మిస్తోంది.ఇది సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కూడిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అని,ఇందులో అత్యాధునిక గ్రాఫిక్స్,అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు భాగమవుతున్నారని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది వెంటనే వైరల్ అవుతోంది.

షూటింగ్ వేగం… కారణాలు:

వాస్తవానికి,ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉండటం వల్ల దీని విడుదల 2027 లో ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే,తాజా సమాచారం ప్రకారం,సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే చాలా వేగంగా జరుగుతోందట.డైరెక్టర్ అట్లీ తన సినిమా మేకింగ్ విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ఉండటం వల్ల,చిత్రీకరణ చకచకా పూర్తవుతోందని తెలుస్తోంది.ఇప్పటికే ముంబైలో 50 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయింది.ఈ షెడ్యూల్‌లో అనేక కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం అబుదాబి వంటి ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తోంది.

జూన్ 2026 నాటికి ముగింపు?

తాజా సమాచారం మేరకు,ఈ భారీ చిత్రం షూటింగ్‌ను 2026 మే లేదా జూన్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.షూటింగ్ త్వరగా పూర్తయితే,మిగిలిన పోస్ట్-ప్రొడక్షన్,వీఎఫ్‌ఎక్స్ పనులను కూడా వేగవంతం చేసి,2026 దసరా పండుగ సందర్భంగా సినిమాను ప్రేక్షకులకు అందించాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.మొదట్లో 2027 అనుకున్నప్పటికీ,ఇప్పుడు షూటింగ్ వేగం చూస్తుంటే 2026 చివర్లోనే సినిమాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా శుభవార్తే.