
D News: ‘మండాడి’ సక్సెస్ మీట్లో హీరో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు మతిమారన్ పుగజేంధి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన మాటలు తెలుగు ప్రేక్షకులను, టాలీవుడ్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు తాజాగా ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
సుహాస్ ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి మాట్లాడే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలు సుహాస్‌ను అవమానించిన ఒక వ్యక్తిని ఉద్దేశించినవేనని మతిమారన్ స్పష్టం చేశారు. తెలుగు ప్రజలను, తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించి తాను మాట్లాడలేదని తెలిపారు. సుహాస్‌కు మద్దతుగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, ఒక కమ్యూనిటీని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.
హైదరాబాద్‌లో జరిగిన ‘మండాడి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లోనే తెలుగు సినిమా పరిశ్రమపై తనకున్న గౌరవాన్ని చెప్పానని దర్శకుడు గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ అద్భుతంగా రాణిస్తోందని తాను అప్పుడే ప్రశంసించినట్లు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు సినిమాకు చూపిస్తున్న ప్రేమను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని మతిమారన్ పేర్కొన్నారు. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులపై తనకు ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.
