అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్-2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు.

సింగిల్స్‌లో గోల్డ్ మెడల్

40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో వివేక్ రెడ్డి తలపడ్డారు. 45 నిమిషాలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన మూడు సెట్ల పోరులో వివేక్ 15-12, 9-15, 15-11 తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా కీలక దశల్లో పట్టుదలతో ఆడి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

డబుల్స్‌లోనూ పతకం

సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన వివేక్ డబుల్స్‌లోనూ తన ప్రతిభను చాటారు. 40+ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీకర్ మోతుకూరితో కలిసి బరిలోకి దిగారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అలెక్సిస్ పెటిప్రెజ్, చిలీకి చెందిన రోడ్రిగో హెర్నాండెజ్ జోడీపై 21-19 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.

ఆగస్టు 30న ప్రారంభమైన ఈ ప్రపంచ కప్ పోటీలు సెప్టెంబర్ 6 వరకు డా నాంగ్‌లో కొనసాగనున్నాయి. 80కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి 4,900 మందికి పైగా క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ఆసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ మొత్తం ప్రైజ్ పూల్ 5 లక్షల అమెరికన్ డాలర్లు.

వివేక్ రెడ్డి గతంలో జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడిగా రాణించారు. అనంతరం పికిల్‌బాల్‌లోకి అడుగుపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌లో పికిల్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్న సమయంలో ఆయన సాధించిన ఈ విజయం క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.

భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం సాధించడం గర్వంగా ఉందని వివేక్ రెడ్డి తెలిపారు. తన విజయం యువతను పికిల్‌బాల్ వైపు ఆకర్షించి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రపంచకప్‌లో స్వర్ణం, కాంస్యం సాధించిన వివేక్ రెడ్డి.. అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్ పేరును మరోసారి నిలబెట్టారు.

By Rajini