
హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి రాగా.. తాజాగా మరో భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐటీ కారిడార్‌తో పాటు పలు ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.
లింగంపల్లిలో నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జి
లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు లైన్ల భారీ స్టీల్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మార్గమధ్యంలో ఉన్న జంక్షన్లను కూడా అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.308 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్ వెళ్లే వాహనదారులకు ప్రయాణం సులభతరం కానుంది. ముఖ్యంగా తెల్లాపూర్, నల్లగండ్ల, గచ్చిబౌలి ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఈ కొత్త స్టీల్ బ్రిడ్జి కారణంగా నల్లగండ్ల ఆర్‌ఓబీతో పాటు లింగంపల్లి అండర్‌పాస్‌పై వాహనాల రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణ కాంక్రీట్ నిర్మాణంతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
రెండు లైన్ల అప్‌ర్యాంప్ కూడా ఏర్పాటు
ఈ ప్రాజెక్టులో భాగంగా గుల్మోహర్ జంక్షన్ నుంచి రెండు లైన్ల అప్‌ర్యాంప్ నిర్మించనున్నారు. మరోవైపు శేరిలింగంపల్లి ఆర్‌ఓబీ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్లే మార్గంలో తరానగర్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం 80 అడుగుల వెడల్పు ఉన్న రహదారులను 100 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. అలాగే గచ్చిబౌలి నుంచి వచ్చే రెండు లైన్ల అప్‌ర్యాంప్‌లను కూడా పొడిగించనున్నారు.
ఐటీ ఉద్యోగులకు మరింత సౌకర్యం
ఇటీవల తెల్లాపూర్, నల్లగండ్ల పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ప్రతిరోజూ తెల్లాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి ఐటీ కారిడార్‌కు భారీగా రాకపోకలు సాగుతున్నాయి.
వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త స్టీల్ ఆర్‌ఓబీ నిర్మాణంతో పాటు రహదారుల విస్తరణ చేపట్టడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతాల్లో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాహనదారులకు సిగ్నల్ రహిత ప్రయాణ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.
