
D News: హైదరాబాద్ సినీ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఐమాక్స్ అనుభూతి మళ్లీ నగరానికి రాబోతోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అత్యాధునిక టెక్నాలజీతో ఐమాక్స్
కొత్త స్క్రీన్‌లో ఐమాక్స్ విత్ లేజర్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. 4K లేజర్ ప్రొజెక్షన్, అధునాతన ఆడియో టెక్నాలజీతో ప్రేక్షకులకు మరింత ఇమ్మర్సివ్ అనుభూతిని అందించనుంది. ఈ స్క్రీన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఐమాక్స్ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నారు.
‘డ్యూన్ 3’తో గ్రాండ్ ఓపెనింగ్?
డిసెంబర్‌లో ఐమాక్స్ ప్రారంభమయ్యే సమయంలో హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ను ప్రదర్శించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 18, 2026న విడుదల కానుంది. అయితే హైదరాబాద్ ఐమాక్స్‌కు ఇదే ఓపెనింగ్ మూవీ అని మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
‘వారణాసి’పై భారీ అంచనాలు
ఇక ఎస్‌ఎస్ రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ వంటి భారీ చిత్రాలను కొత్త ఐమాక్స్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వారణాసి’ టీమ్ కూడా 2027 ఏప్రిల్ 7న హైదరాబాద్ ఐమాక్స్‌లో సినిమాను ఆస్వాదించాలంటూ ఇప్పటికే ప్రస్తావించింది. దీంతో ఈ కొత్త స్క్రీన్‌పై టాలీవుడ్ భారీ చిత్రాల ప్రదర్శనపై అంచనాలు పెరిగాయి.
మొత్తానికి దాదాపు పుష్కరకాలం తర్వాత హైదరాబాద్‌లో ఐమాక్స్ అనుభూతి తిరిగి రావడంతో నగర సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
