D News: Aug 13: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును నిలిపి సోదాలు నిర్వహించారు. కారులో మూడు పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసిన 25.970 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గంజాయితో పాటు నిందితులు ఉపయోగించిన కారును, రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన దులపల్లి సుజీవ్ కుమార్, మొదుగు నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి విజయవాడకు చెందిన చినంశెట్టి రాజేష్ అనే వ్యక్తికి గంజాయిని చేరవేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

గంజాయిని సరఫరా చేసిన సీలేరుకు చెందిన చింటూతో పాటు కొనుగోలుదారు చినంశెట్టి రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర వివరాలను కూడా విచారణలో వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.