
DNews: Apr18: అస్థిరంగా ఉన్న మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి దిశగా ఒక కీలకమైన అడుగు పడింది. తమపై జరిగిన దాడులకు ప్రతీకారంగా మూసివేసిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ శుక్రవారం పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే వరకు అన్ని వాణిజ్య నౌకలు దీని గుండా ప్రయాణించవచ్చని ఆ దేశం ప్రకటించింది. ఈ పరిణామాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. హోర్ముజ్‌ను తెరిచినందుకు ఆయన టెహ్రాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే, యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం కుదిరే వరకు ఇరాన్‌పై దిగ్బంధనాన్ని ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. హోర్ముజ్ పూర్తిగా తిరిగి తెరవడంతో శుక్రవారం ఒక్కరోజే చమురు ధరలు దాదాపు 11% తగ్గాయి. మరోవైపు, అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండో విడత చర్చలు వచ్చే వారం జరిగేలా కనిపిస్తున్నాయి. వాటికి మళ్లీ ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్థాన్ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది.
