
D News: Aug 11: ఆగస్టు 15న జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట వద్ద నిర్వహించనున్న ప్రధాన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాయి. సుమారు 24 వేల మంది అతిథులు హాజరుకానున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో నగరవ్యాప్తంగా నిఘాను మరింత పెంచారు.
భద్రతా చర్యల్లో భాగంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్ ఖైదా, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి సంస్థలకు చెందిన 19 మంది ఉగ్రవాదుల వివరాలతో ఈ పోస్టర్లను రూపొందించారు. మెట్రో స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వీటిని ప్రదర్శించారు.
పోస్టర్లలో ఉన్న వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే 112 కంట్రోల్ రూమ్‌కు లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, విశ్వసనీయమైన సమాచారం అందించిన వారికి రివార్డు కూడా అందజేస్తామని ప్రకటించారు.
ఎర్రకోట పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 1,000కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వీడియో విశ్లేషణ వ్యవస్థలను వినియోగిస్తూ అనుమానాస్పద కదలికలను రియల్‌టైమ్‌లో గుర్తించేలా చర్యలు చేపట్టారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సుమారు 15,000 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరించారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా SWAT కమాండోలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించారు. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ పరిధిలో డ్రోన్లు, UAVలు, హాట్ ఎయిర్ బెలూన్లు వంటి గగనతల వాహనాలపై పూర్తి నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.
భద్రతా తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎర్రకోట సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. గత నవంబర్‌లో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని, నిఘా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా వాహన తనిఖీలు, గస్తీని ముమ్మరం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
