DET:DEC 09:
టాలీవుడ్ నటి కొల్లా హేమకు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఊరట లభించింది.ఈ కేసులో ఆమెపై నమోదైన ఆరోపణలను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.అయితే ఈ న్యాయ పోరాటం జరుగుతున్న సమయంలోనే ఆమె తల్లి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషయాల గురించి హేమ ఇటీవల ఒక భావోద్వేగ వీడియో ద్వారా పంచుకున్నారు.

న్యాయం గెలిచింది రేవ్ పార్టీ కేసు కొట్టివేత:
2024 మే నెలలో జరిగిన బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో నటి హేమపై నమోదైన ఆరోపణలను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.కేసు విచారణ సందర్భంగా డ్రగ్స్ టెస్టింగ్‌లో సరైన శాస్త్రీయ పద్ధతులు మరియు విశ్వసనీయ ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది.హైకోర్టు ఈ తీర్పును నవంబర్ 3న వెలువరించినట్లు హేమ తెలిపారు.తాను ఏ తప్పూ చేయలేదని చివరకు న్యాయం గెలిచి,తాను కడిగిన ముత్యంలా బయటపడ్డానని ఆమె పేర్కొన్నారు.

తల్లి మరణంతో తీవ్ర విషాదం:

కేసులో నిర్దోషిగా తేలడం సంతోషాన్నిచ్చినా ఈ సమయంలోనే తన అమ్మను కోల్పోవడం తీరని వేదన మిగిల్చిందని హేమ కన్నీటిపర్యంతమయ్యారు.కేసు కారణంగా తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు ట్రోలింగ్‌ను తన తల్లి తట్టుకోలేకపోయారని ఆ బాధతోనే ఆమె అనారోగ్యానికి గురై మరణించారని హేమ ఆరోపించారు.నా తల్లి నా బలం.నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆమె వల్లే.నాపై వచ్చిన తప్పుడు ప్రచారాన్ని ఆమె తట్టుకోలేకపోయారు.కోర్టులో కేసు గెలిచాను కానీ అమ్మను శాశ్వతంగా పోగొట్టుకున్నాను అని హేమ భావోద్వేగానికి లోనయ్యారు.

మీడియా ట్రయల్‌పై ఆగ్రహం:
తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసిన మీడియా,సోషల్ మీడియా ట్రోలర్లపై హేమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని తాను ముందుగా చెప్పినా,నిరాధార ఆరోపణలు,ట్రోలింగ్ ఆపలేదని ఆమె అన్నారు.ఈ తప్పుడు ప్రచారం తన వ్యక్తిగత జీవితాన్ని,వృత్తిని తీవ్రంగా దెబ్బతీసిందని,దాదాపు సంవత్సరంన్నర పాటు నరకం అనుభవించానని ఆమె తెలిపారు.ఇటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారికి మనస్సాక్షి లేదా అని ఆమె ప్రశ్నించారు.