
D Spiritual: Jan 23: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేటి నుంచే మేడారం జాతరకు ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవల ద్వారా భక్తులు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా మేడారం చేరుకునే అవకాశం లభించనుంది. అదేవిధంగా జాతర ప్రాంతాన్ని ఆకాశం నుంచి వీక్షించే అరుదైన అనుభవం కూడా భక్తులకు కలగనుంది.
మేడారం సమీపంలోని పడిగాపూర్ గ్రామం వద్ద ప్రత్యేక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెలికాప్టర్ సేవల ద్వారా భక్తులు 6 నుంచి 7 నిమిషాల పాటు జాతర ప్రాంతాన్ని విహంగ వీక్షణ చేసే జాయ్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్రత్యేక ప్రయాణానికి ఒక్కొక్కరి నుంచి రూ.4,800 ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇది ఒక కొత్త, విశేష అనుభూతిని అందించనుంది.
అలాగే హనుమకొండ (HNK) నుంచి మేడారానికి రానుపోను హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సేవలకు ఒక్కొక్కరికి రూ.35,999 ఛార్జ్ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్ సేవలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేందుకు ఈ ఏర్పాట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
