D Spiritual: Aug 12: తిరుమలలో భారీ రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల పంపిణీ నిలిపివేత

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు వెలుపలి వరకు విస్తరించడంతో తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అత్యవసర నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బుధవారం జారీ చేయాల్సిన గురువారం నాటి సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల పంపిణీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

తిరుపతి కౌంటర్లకు రావొద్దని టీటీడీ సూచన

ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో ఉన్న ఎస్‌ఎస్‌డీ టోకెన్ కౌంటర్ల వద్దకు రావొద్దని టీటీడీ సూచించింది. కౌంటర్ల వద్ద సమయం వృథా చేసుకోకుండా భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించాలని కోరింది. అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను గురువారం రోజున యథావిధిగా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

శ్రీవారి హుండీకి రూ.4.46 కోట్ల ఆదాయం

మంగళవారం ఒక్కరోజే మొత్తం 78,956 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 31,014 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.