D NEWS: నిత్యావసర ధరల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సామాన్య ప్రజలపై ధరల భారం పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేశారు.

సన్నబియ్యం ధరలు నాలుగు నెలల్లో 25 శాతం పెరిగాయని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట ఉత్పత్తి పెరిగిందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించాలని ప్రశ్నించారు.

రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, వినియోగదారుడికి అందుబాటు ధరలో బియ్యం లభించడం లేదని హరీశ్ రావు అన్నారు. మధ్యవర్తులు లాభపడుతున్నారని ఆరోపిస్తూ, మార్కెట్ వ్యవస్థపై ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేశారు.

ఉల్లి కిలో రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 వరకు ధరలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ ధరలతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్‌పై భారం పడుతోందని, పౌరసరఫరాల శాఖ ధరల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని కోరారు.

బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణమే తనిఖీలు నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సన్నబియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.