
D NEWS: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్. స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణలో తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్టీఫెన్‌సన్ కోరారు. కేసులో తనను కీలక బాధితుడిగా పరిగణించి అదనపు వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరినట్లు సమాచారం.
స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం పరిశీలించింది. పిటిషన్‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్‌సన్‌ను ఓటు వేయించేందుకు నగదు ఆఫర్ చేశారనే ఆరోపణలతో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు, హైకోర్టులో పలు పిటిషన్లు, రాజకీయ వివాదాలు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన వాదనలను కూడా విచారణలో భాగంగా పరిగణించాలని ఆయన కోరడంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.
