D Spiritual: Nov 24: ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న భారీ సంఖ్యలో భక్తులు!

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ముందుగా స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఘాట్ రోడ్డులోని శ్రీ అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకునేలా ప్రదక్షిణ కొనసాగింది.

కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక శోభ

గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యాల నాదాలు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అధికారులు

ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, ఫెస్టివల్స్ సెక్షన్ ఏఈవో డాక్టర్ కే. గంగాధర్, సూపరింటెండెంట్ హేమ దుర్గాంబ, సీనియర్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *