
D Spiritual: Nov 21: పిట్లంలో వైభవంగా కార్తీక దీపోత్సవం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు
పిట్లం: పిట్లం మండల కేంద్రంలోని భూలక్ష్మమ్మ–పాపమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా దీపాలను వెలిగించి భూలక్ష్మమ్మ, పాపమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మహిళలు వెలిగించిన దీపాలతో ఆలయ ప్రాంగణమంతా కాంతులతో నిండిపోయింది. భక్తిపారవశ్యంతో మహిళలు కార్తీక దీపోత్సవంలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
