D News: Oct 5: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు మరింత విస్తరించాయి. న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (EHS) కింద ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 919 ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్‌ వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు ఎంప్లాయీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. వీటిలో 778 ప్రైవేట్‌ ఆసుపత్రులు, 141 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి.

ఈహెచ్‌ఎస్‌ పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 15,395 చికిత్సలకు సంబంధించి రూ.104.63 కోట్ల విలువైన ముందస్తు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్‌పేషెంట్‌, ఔట్‌పేషెంట్‌ సేవలతో పాటు వెల్‌నెస్‌ సెంటర్లలో వైద్యుల సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులను కూడా నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా అందించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

సెప్టెంబర్‌ 1 నుంచి పోలీసు శాఖ ఉద్యోగులు, పింఛన్‌దారులను కూడా ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఉద్యోగులు, పింఛన్‌దారుల చందాల ద్వారా ప్రతి నెలా రూ.44 కోట్లు సమకూరుతుండగా.. ప్రభుత్వం కూడా మరో రూ.44 కోట్లను అందిస్తోంది. దీంతో ఈహెచ్‌ఎస్‌ పథకం కోసం ప్రతి నెలా మొత్తం రూ.88 కోట్ల నిధులు అందుబాటులో ఉంటున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మరో 25 వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో 21 కేంద్రాలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనుండగా.. మరో నాలుగు కేంద్రాలను హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

అర్హత ఉన్న ఉద్యోగులు, పింఛన్‌దారులకు హెల్త్‌ కార్డు ఇంకా జారీ కాలేదనే కారణంతో వైద్య సేవలను నిరాకరించకూడదని అధికారులు స్పష్టం చేశారు. హెల్త్‌ కార్డు అందుబాటులో లేకపోయినా గుర్తింపు సంఖ్య ఆధారంగా అర్హులైన ఉద్యోగులు, పింఛన్‌దారులు వైద్య సేవలను పొందవచ్చని తెలిపారు.

సెప్టెంబర్‌ 28 నాటికి 12,56,962 మంది లబ్ధిదారులకు హెల్త్‌ కార్డులు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 7,56,210 మంది ఇప్పటికే తమ హెల్త్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈహెచ్‌ఎస్‌ పరిధిలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.