
D Spiritual: Jul 6: అయోధ్య రామ మందిరం: అయోధ్యలోని భవ్య రామమందిరానికి విరాళంగా అందించిన అత్యంత విలువైన ‘రామచరితమానస్’ గ్రంథం కనిపించకుండా పోయిందన్న ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఎస్. లక్ష్మీనారాయణ తాను సమర్పించిన ఈ అరుదైన గ్రంథం ఆలయంలో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
సుమారు రూ.5 కోట్ల విలువైన, బంగారు పూత పూసిన ‘రామచరితమానస్’ పుస్తకాన్ని ఆయన 2024 ఏప్రిల్‌లో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందజేశారు. అయితే, ఇంత విలువైన విరాళాన్ని స్వీకరించినప్పటికీ ట్రస్ట్ నిర్వాహకులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక రశీదు (రిసీప్ట్) ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. దీంతో ఆలయంలో విరాళాల నిర్వహణ, భద్రత, పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రస్ట్ నిర్వహణపై ప్రశ్నలు
ఈ వివాదంపై స్పందించిన లక్ష్మీనారాయణ, విరాళంగా ఇచ్చిన బంగారు పుస్తకం ప్రారంభంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆలయ ప్రాంగణంలో భక్తులకు కనిపించేదని తెలిపారు. అయితే అనంతరం అది అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని, ప్రస్తుతం దాని ఆచూకీ ఎక్కడా లభించడం లేదని ఆరోపించారు. ఇంత విలువైన కానుక అదృశ్యమవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
చంపత్ రాయ్ బాధ్యత వహించాలని డిమాండ్
ఈ ఘటనకు సంబంధించి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ పూర్తి బాధ్యత వహించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించే విలువైన విరాళాల భద్రతపై ట్రస్ట్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ ఘటన అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వహణ, విరాళాల భద్రత, పారదర్శకత అంశాలపై కొత్త చర్చకు దారితీసింది.
