‘నెవర్ గివ్ అప్.. ఒకరికి ఒక అటెంప్ట్‌లో వస్తుంది.. మరొకరికి రెండో అటెంప్ట్‌లో వస్తుంది. కానీ ఓపికగా ఎదురుచూస్తూ, నిరంతరం చదువుతూ ఉంటే ఏదో ఒక రోజు విజయం తప్పకుండా వస్తుంది’.. తెలంగాణకు చెందిన గొల్లె ప్రవీణ్ కుమార్ విజయ ప్రయాణం చెప్పే సందేశం ఇదే. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేకపోవడం, ఇతరుల వెటకారపు మాటలు.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే తన లక్ష్యాన్ని వదులుకోలేదు. చదువుకుంటూనే ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేశారు. అదే సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. చివరకు ఆయన కష్టానికి ఫలితం దక్కింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు..

ప్రవీణ్ తన విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఆ క్షణాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు. ‘ఆ క్షణం ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉంది. నాది స్టేట్ ర్యాంక్ 17 వచ్చింది. ఆ ర్యాంక్ చూసి, మార్కులు చూసి, అందులో నా నంబర్ చూసిన తర్వాత ఆ సిట్యుయేషన్ అసలు మాటల్లో చెప్పలేను అని ప్రవీణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఫలితాలు వచ్చిన సమయంలో తెల్లవారుజామున సుమారు 4:40 గంటలకు మా ఇంటికి ఫోన్ చేశాను. మొదట కుటుంబ సభ్యులు ఎవరూ ఫోన్ ఎత్తలేదు. మళ్లీ ఫోన్ చేయడంతో వారు ఎత్తారు. అంత తెల్లవారుజామున ఫోన్ రావడంతో ఏదైనా సమస్య వచ్చిందేమోనని నా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అప్పుడు వారికి ఒకే మాట చెప్పాను.. ‘అమ్మా, నాన్న.. ఏం లేదు. మీరు టెన్షన్ పడకండి. మనకు మంచి రోజులు వచ్చినాయి. ఇబ్బందులు పోయాయి. నాకు జాబ్ వచ్చింది’., ఆ మాట వినగానే అటు ఇంట్లోనూ, ఇటు నేను ఉన్న చోటా ఆనందభాష్పాలు వచ్చాయని ప్రవీణ్ తెలిపారు. నేను ఇక్కడ ఏడుస్తున్నా.. వాళ్లు అక్కడ ఏడుస్తున్నారు. అది బాధతో వచ్చిన ఏడుపు కాదు. ఆ సంతోషాన్ని అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేమని ఆయన చెప్పారు.

జన్నారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు..

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన ప్రవీణ్‌ది సాధారణ కుటుంబ నేపథ్యం. ఆయన అన్న మేస్త్రీ పని చేస్తారు. తల్లి బీడీలు చుడతారు. ఆ ప్రాంతంలో బీడీలు తయారు చేయడం సాధారణమైన పని కావడంతో చాలా మంది మహిళలు ఆ పనిపై ఆధారపడుతుంటారు. ప్రవీణ్ తల్లి కూడా అదే పని చేసేవారు. డిగ్రీ వరకు ప్రవీణ్ చదువంతా జన్నారంలోనే సాగింది. అప్పటివరకు ప్రవీణ్‌కు ఏ సిటీ తెలియదు. ఏం తెలియదు. తమ ఊరు తప్ప ఇంకేమీ తెలియదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఓ స్నేహితుడు చెప్పిన మాట ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. క్యాంపస్‌లో ఉచితంగా సీటు వస్తే ఉన్నత చదువులు చదవవచ్చని స్నేహితుడు చెప్పడంతో ప్రవీణ్ కూడా ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ ఉస్మానియా యూనివర్సిటీలో సీటు లభించింది. ఉచిత విద్య కావడంతో కుటుంబంపై ఆర్థిక భారం లేకుండా ఆయనను తల్లిదండ్రులు యూనివర్సిటీకి పంపించారు. అలా 2013లో ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టారు.

యూనివర్సిటీలో చేరిన తర్వాత ప్రవీణ్‌కు సీనియర్ల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ప్రతిరోజూ క్లాసులు పూర్తయిన తర్వాత సీనియర్లు విద్యార్థులను కూర్చోబెట్టి మాట్లాడేవారు. మనమందరం పేదరికం నుంచే వచ్చిన వాళ్లం. యూనివర్సిటీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. మీరు కూడా ఏదో ఒకటి సాధించి, ఇక్కడి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఉద్యోగంతో బయటికి వెళ్లాలి అని సీనియర్లు ప్రోత్సహించేవారని ప్రవీణ్ చెప్పారు. ఆ మాటలు ఆయనలో లక్ష్యాన్ని ఏర్పరిచాయి. దీంతో ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యారు. అయితే వెంటనే విజయం దక్కలేదు. సీనియర్ల ప్రోత్సాహంతో పలు ఉద్యోగ పరీక్షలు రాసినా ప్రవీణ్‌కు ఉద్యోగం రాలేదు. అదే సమయంలో ఎంకామ్ కోర్సు పూర్తయ్యే దశకు వచ్చింది. క్యాంపస్ హాస్టల్ వదిలి బయట రూమ్ తీసుకుని ఉండేంత ఆర్థిక స్థోమత ఆయనకు లేదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా చదువును మాత్రం వదిలిపెట్టలేదు. బీఎడ్‌లో చేరి క్యాంపస్‌లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఎంఎడ్ కూడా పూర్తి చేశారు. బీఎడ్ చదువుతున్న సమయంలో స్కూల్‌లో పిల్లలకు బోధించే అవకాశం ఆయన ఆలోచనా విధానాన్ని మరోసారి మార్చింది.

డైలీ స్కూల్‌కు వెళ్లి పిల్లలకు టీచింగ్ చేయాల్సి ఉంటుంది. పిల్లలను చూసి, వాళ్లకు క్లాసులు చెప్పడం చూస్తుంటే టీచింగ్ ఫీల్డ్‌పై ఆసక్తి పెరిగిందని ప్రవీణ్ చెప్పారు. టీచర్ కావాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ప్రవీణ్‌కు డీఎస్సీ ఉద్యోగం రాలేదు. ఇక ఇతర ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే పుస్తకాలు, ప్రయాణం, వసతి వంటి ఖర్చులు అవసరం. కానీ కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే కుటుంబంపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇంట్లో ఇద్దరు సోదరీమణులు ఉండటంతో వారి వివాహాలు, అప్పుల భారం వంటి బాధ్యతలు కుటుంబంపై ఉన్నాయి. వాళ్లకు సపోర్ట్‌గా ఉండాల్సిన సమయంలో వాళ్లకు బర్డెన్ అయి, మళ్లీ వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నామోషీగా ప్రవీణ్ భావించారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆయనను ఎప్పుడూ చదువు విషయంలో ప్రోత్సహించేవారు. వాళ్లకు అప్పులు ఉన్నా, కూలి పని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ కూడా ‘నువ్వు చదువుకో.. మేము చూసుకుంటాం’ అని చెప్పేవారు. తల్లిదండ్రుల కష్టాన్ని చిన్నప్పటి నుంచే చూసిన ప్రవీణ్ మాత్రం వారిపై మరింత ఆర్థిక భారం పెట్టకూడదని నిర్ణయించుకున్నారు.

నైట్ వాచ్‌మ్యాన్ ఉద్యోగం.. జీవితంలో కీలక మలుపు

అదే సమయంలో ప్రవీణ్ రూమ్‌మేట్ అప్పటికే వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగం గురించి తెలుసుకున్న ప్రవీణ్ తన స్నేహితుడిని అడిగారు. తనకు ఏమైనా ఛాన్స్ ఉంటే చూడు. నైట్ డ్యూటీ కదా.. చదువుకోవచ్చు. అదే సమయంలో కొంత డబ్బు కూడా వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదని అడిగారు. స్నేహితుడు సంబంధిత అధికారిని అడగడంతో కొంతకాలం తర్వాత ప్రవీణ్‌కు ఉస్మానియా యూనివర్సిటీలోని EMRCలో నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ ఉద్యోగం ఆయన జీవితంలో కీలకంగా మారింది. రాత్రి విధులు నిర్వర్తిస్తూ, మిగిలిన సమయంలో చదువుకునే అవకాశం లభించింది. ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం ఆయన వ్యక్తిగత ఖర్చులకు సరిపోయేది. ఒక పని చేస్తూ చదువుకుంటున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వాళ్లు కూడా సరే.. పని చేసుకుంటూ చదువుకో అని చెప్పేవాళ్లు. వాళ్లను డబ్బులు అడగాల్సిన అవసరం లేకపోయిందని ప్రవీణ్ చెప్పారు.

‘సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడంట.. ఇక అంతే’ అంటూ హేళన

నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సమయంలో కొందరు ప్రవీణ్‌ను హేళన కూడా చేశారు. ‘మీ వాడు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడంట కదా.. ఇక అంతేగా. ఏదో జాబ్ చేస్తున్నాడు కదా. ఇంకేం చదువుతాడు? ఉద్యోగాలు ఏం రావు. ఏదో పెళ్లి చేసుకుని అదే జాబ్ చేసుకుంటూ ఉండొచ్చుగా’ అని కొందరు అనేవారని ప్రవీణ్ గుర్తుచేసుకున్నారు. అయితే ఆ మాటలు ఆయనను వెనక్కి లాగలేదు. ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టారు. పోటీ పరీక్షల సమయంలో ఇంగ్లిష్ కూడా తనకు సవాలుగా ఉండేదని ప్రవీణ్ చెప్పారు. నోటిఫికేషన్ లేని సమయంలో CTET పరీక్షకు సిద్ధమయ్యారు. పరీక్ష మొత్తం ఇంగ్లిష్‌లో ఉండటంతో ఆ సమయంలో ఇంగ్లిష్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తెలియని పదాల కోసం ప్రత్యేకంగా ఓ నోట్‌బుక్ పెట్టుకున్నారు. అర్థం కాని కొత్త పదాలు ఉంటే నోట్‌బుక్‌లో రాసుకుని, వాటిని నేర్చుకుంటూ, అప్పుడప్పుడు చూస్తూ బైహార్ట్ చేసుకుంటూ.. ఇలా చిన్న చిన్న విషయాలపై క్రమం తప్పకుండా పనిచేయడం ద్వారా ఇంగ్లిష్‌పై ఆయనకు మంచి పట్టు వచ్చింది. అది తర్వాత రాసిన పోటీ పరీక్షల్లో కూడా ఉపయోగపడింది.

ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

ఏళ్ల తరబడి కష్టపడి చదివిన ప్రవీణ్‌కు చివరకు వరుస విజయాలు దక్కాయి. గురుకులాల్లో జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు సాధించారు. ఒకప్పుడు నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేసిన అదే ప్రదేశంలో ఆయనకు సన్మానం జరగడం మరో భావోద్వేగ క్షణంగా మారింది. కాన్ఫరెన్స్ హాల్‌లో అందరూ కలిసి తనను కూర్చోబెట్టి సన్మానం చేశారు. అది ప్రవీణ్‌ జీవితంలో మొట్టమొదటి సన్మానం. అప్పటి వరకు వాచ్‌మ్యాన్‌గా ఉన్న ఆఫీస్‌లోనే తనకు సన్మానం చేయడం చాలా హ్యాపీగా అనిపించిందని ప్రవీణ్ చెప్పారు. ఉద్యోగం సాధించిన తర్వాత తన భవిష్యత్ లక్ష్యం ఏమిటో కూడా ప్రవీణ్ స్పష్టంగా చెప్పారు. తనకు చిన్నతనంలో, చదువుకునే సమయంలో అవకాశాల గురించి సరైన అవగాహన లేకపోయిందని ఆయన చెప్పారు. అందుకే తాను టీచర్‌గా మారిన తర్వాత పిల్లలకు విద్యా, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు ఏ అవేర్‌నెస్ అయితే లేదో, ఆ అవేర్‌నెస్‌ను పిల్లలకు కల్పించాలి. అవకాశాలు ఏమేమి ఉన్నాయి అనేది వాళ్లకు తెలిస్తే, చదివే స్తోమత ఉన్నా లేకపోయినా, ఫలానా చోట అవకాశాలు ఉన్నాయని తెలుసుకుని వాటిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారని ప్రవీణ్ తెలిపారు.

ప్రవీణ్ పదేళ్ల ప్రయాణం ఒక ఉద్యోగం సాధించిన కథ మాత్రమే కాదు. ఆర్థిక ఇబ్బందులు, వైఫల్యాలు, ఇతరుల విమర్శలు ఉన్నా లక్ష్యాన్ని వదులుకోకుండా ముందుకు సాగిన ప్రయాణం. ఒక ప్రయత్నంలో ఉద్యోగం రాకపోతే అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఒకరికి ఒక అటెంప్ట్‌లో వస్తుంది. ఒకరికి రెండో అటెంప్ట్‌లో వస్తుంది. కానీ పేషెన్స్‌గా వెయిట్ చేసి, కంటిన్యూయస్‌గా చదువుతూ ఉంటే కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. నెవర్ గివ్ అప్” అనేది ప్రవీణ్ సందేశం. ఒకప్పుడు పేదరికం కారణంగా కుటుంబంపై భారం కాకూడదని నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేసిన యువకుడు.. అదే సమయంలో చదువుకుంటూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయగాథ. ప్రయత్నం ఆపకుండా, పరిస్థితులకు లొంగకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటే విజయం ఏదో ఒక రోజు మన తలుపు తడుతుందనే విషయాన్ని ప్రవీణ్ ప్రయాణం మరోసారి నిరూపించింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana