
D Educt: Aug 25: రాష్ట్ర ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన నేపథ్యంలో మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు.
వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత వాటికి అనుగుణంగా ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలకు మెరుగ్గా సిద్ధం కావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మైనారిటీ విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ల విడుదల అనంతరం వెల్లడిస్తామని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
