అమెరికా ఎన్నికల్లో ఓటర్ ఐడీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డిమాండ్ చేశారు. భారత ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఫొటో గుర్తింపు కార్డు లేకుండానే అమెరికాలో ఓటింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. భారతదేశంలో 64 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ప్రతి ఓటరికి ఫొటో ఐడీ తప్పనిసరిగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే విధానాన్ని అమెరికాలోనూ అమలు చేయాలని, ఇందుకోసం ‘సేవ్ అమెరికా యాక్ట్‌’ను తక్షణమే ఆమోదించాలని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో ఓటింగ్ ప్రక్రియ, పౌరసత్వ ధ్రువీకరణ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన ‘సేవ్ అమెరికా యాక్ట్‌’ను చట్టసభలు త్వరగా ఆమోదించాలని కోరుతున్నారు. తన వాదనకు మద్దతుగా భారత్‌ ఎన్నికల వ్యవస్థను ట్రంప్ ఉదాహరణగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియగా భారత్‌లో నిర్వహించే ఎన్నికలను ప్రస్తావిస్తూ, ఓటర్ల గుర్తింపు కార్డులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలు, ‘సేవ్ అమెరికా యాక్ట్‌’లోని ప్రతిపాదనలు, భారత్‌ ఎన్నికల విధానంతో ఆయన చేసిన పోలికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్‌’లో డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తనతో ప్రస్తావించిన ప్రశ్నలను ట్రంప్ తన పోస్టులో వెల్లడించారు. సరైన ఫొటో గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారంటూ సీఈసీ ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు.