
Hyderabad | ప్రయాణికురాలు బస్సు నుంచి కిందకు నెట్టేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళా కండక్టర్ ప్రవళిక మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకుని ప్రవళిక మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రవళిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అలాగే ప్రవళిక తల్లికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
మణుగూరు డిపోలోనే బంద్
మరోవైపు ప్రవళిక మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనలపై కూడా మంత్రి స్పందించారు. మణుగూరు డిపోలో ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారని తెలిపారు. అయితే మణుగూరు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బస్సు రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
