
‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిన నటుడు మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. మౌళి తనుజ్ ప్రశాంత్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో శ్రీను కంబాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే క్యాచీ టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
సెప్టెంబర్ 4న థియేటర్లలోకి..
మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రిలీజ్ డేట్ వెనుక మౌళికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. గతేడాది మౌళి నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సెప్టెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఈసారి కూడా సెప్టెంబర్ తొలి వారంలో ‘దొంగ నా కొడుకు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
జ్యువెలరీ షాప్ రాబరీ చుట్టూ కథ..
ఓ జ్యువెలరీ షాప్‌లో జరిగే దొంగతనం చుట్టూ తిరిగే క్రైమ్ అండ్ రాబరీ కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన కథాంశంతో పాటు మౌళి కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై సినీ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా డిజిటల్ ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.
‘#90s’తో వచ్చిన గుర్తింపు, ‘లిటిల్ హార్ట్స్’తో పెరిగిన క్రేజ్‌ను ‘దొంగ నా కొడుకు’తో మరింతగా కొనసాగించాలని మౌళి చూస్తున్నాడు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అండగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గత సినిమా సెంటిమెంట్ కూడా కలిసొస్తే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
hash tags
