శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. దీంతో సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండో టెస్టుకు సుందర్ అందుబాటులో ఉంటాడా?

శ్రీలంకతో రెండో టెస్టు కోసం వాషింగ్టన్ సుందర్‌ను అదనపు ఆటగాడిగా ఎంపిక చేసినప్పటికీ.. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రస్తుతం హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి అతడు కోలుకుంటున్నాడు. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో కొలంబోలో జరగనున్న రెండో టెస్టుకు సుందర్ జట్టుతో కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఒకవేళ సుందర్ ఫిట్‌గా ప్రకటించినా వెంటనే టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దింపే విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఆటగాళ్లను బరిలోకి దింపి మళ్లీ గాయపడిన సందర్భాలు ఉండటంతో.. సుందర్ విషయంలో తొందరపడకూడదనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది.

మెడికల్ టీమ్ పర్యవేక్షణలో వాషింగ్టన్

ఇంగ్లండ్ సిరీస్ సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడి రికవరీని వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం అతడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించాడా లేదా అనే అంశంపై మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

వచ్చే వారం సుందర్ ఫిట్‌నెస్‌ను మరోసారి సమీక్షించిన అనంతరం అతడిని శ్రీలంకకు పంపించాలా? లేదా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సుందర్ రెండో టెస్టుకు కూడా దూరమైతే అతడి స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సి రావచ్చు.

ఇప్పటికే బుమ్రా, సాయి సుదర్శన్ దూరం

భారత జట్టు ఇప్పటికే కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఔకిబ్ నబీకి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.

మరోవైపు కాలికి గాయం కావడంతో సాయి సుదర్శన్ కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో బ్యాటింగ్ విభాగంలోనూ భారత్‌కు సమస్యలు ఎదురయ్యాయి.

ఇక గాయాల నుంచి కోలుకుంటున్న ఆకాశ్ దీప్, ఇతర ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పైనా టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది. కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.

ఆగస్టు 15 నుంచి గాలేలో తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ వేదికగా జరగనుంది.